రాజకీయ బీజాలు
ఎన్.టి.ఆర్. రాజకీయ ఇతివృత్తం గల చిత్రాలలో నటించారు. చలనచిత్రాలలో మొదటిసారి మానుకున్న కాలంలోని చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవస్థపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్భాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్ లో ఎన్.టి.ఆర్. బయటపెట్టారు. అలా ఔట్ డోర్ షూటింగ్ కోసం ఒకసారి హిమాలయ ప్రాంతంలోని మనాలికి వెళ్ళ్లారు. అక్కడ షూటింగ్ లోకేషన్ కు వెళ్ళ్లేసందర్భంలో బి.వి. మోహన్ రెడ్డి (తర్వాత మంత్రి) మొదలగు వారితో వేదంతధోరణిలో మాట్లాడారు. మనసులో ఏవేవో భావాలు ఆయన మాటల్లో బయటపడ్డాయి. "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి, సిరిసంపదలు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని మధనపడుతున్నట్లు మాట్లాడారు. ఆ సందర్భానికి అనుగుణంగానే బి.వి.మోహన్ రెడ్డి "అన్నగారూ! మీరు కనుక రాజకీయ రంగప్రవేశం చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి" అని తన భవిష్యవాణిని వినిపించారు. రాజకీయాలలో ప్రవేశించాలన్న తన అంతరంగంలోని తొలి ప్రకంపనలను 1980 ప్రాంతాలలో "సర్దార్ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్ లో ఉండగా ఎన్.టి.ఆర్. వెల్లడించారు. అదే ఆయన పత్రికాముఖంగా వెల్లడించిన తొలి ప్రకటన. సినిమా పత్రికల విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా"60" ఏళ్ళ్లు నిండిన తర్వాత తాను ప్రజాజీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని" తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను తలచుకుని బాధ ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావాడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ లోని అస్థిరధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్టీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు.
అప్పటికే ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. అల్లుడి పెండ్లి రిసెప్షన్ కు ఎన్.టి.ఆర్. బంజారాహిల్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఎన్.టి.ఆర్.కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్.టి.ఆర్. తిరస్కరించారు. కొడితే కుంభస్థలంలాంటి ముఖ్యమంత్రి అవకాశాన్నే కొట్టాలిగాని ఈ చిన్నా చితకా ఆయనకి నచ్చలేదు. హైదరాబాద్ లో అల్లుడి రిసెప్షన్ సందర్భంలోనే అల్లుడి హొదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్.టి.ఆర్. కుటుంబం రుచి చూసింది. ఇంతలో చిత్తూరుజిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో అంజయ్య, చంద్రబాబునాయుడును సస్పెండ్ చేసారు. అల్లుణ్ణి మళ్ళ్లీ మంత్రివర్గంలోకి చేర్పించడానికి ఎన్.టి.ఆర్. తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు తన మిత్రుడు అమితాబ్ ద్వారా అల్లుణ్ణి క్యాబినేట్ లో ప్రవేశపెట్టగలిగారు. అప్పుడు రామారావుకు రాష్ట్ర రాజకీయాలు ఏరకంగా నడుస్తాయో, ఎలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయో దీనితో అర్థమైంది. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని, స్వార్థ ప్రయోజనాలకోసం వినోదప్రాయంగా నడిపే చదరంగమని ఆయనకు బోధపడింది. రాష్ట్ర రాజకీయాన్ని ప్రజారాజకీయాలవైపు మలుపుతిప్పే ఆలోచన ఆనాడే ఆయనలో మొలకెత్తింది.